ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను ఒక్క పైసా కూడా పెంచబోమని స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజలపై భారంగా మారిన ‘ట్రూఅప్’ ఛార్జీల స్థానంలో ‘ట్రూడౌన్’ చేసి ప్రజలకు విముక్తి కలిగించామని, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ సంస్థలను మళ్ళీ లాభాల బాటలోకి మళ్ళిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించామని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణల ద్వారా నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు.









