వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మే 1వ తేదీన వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 993 మేర ధర పెరగడంపై ఆయన స్పందిస్తూ, ఇది సామాన్యుల నడ్డి విరిచే చర్య అని అభివర్ణించారు. ఎన్నికలు ముగియగానే ద్రవ్యోల్బణం సెగ తగులుతుందని తాను ముందే హెచ్చరించానని, ఇప్పుడు అది నిజమైందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు నెలల్లోనే సిలిండర్ ధర రూ. 1,380 పెరిగిందని, అంటే దాదాపు 81 శాతం పెరుగుదల నమోదైందని ఆయన గణాంకాలతో వివరించారు. దీనిని “కేంద్రం వసూలు చేస్తున్న ఎన్నికల బిల్లు”గా ఆయన అభివర్ణించారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాయ్‌వాలా, ధాబా, హోటల్, బేకరీ వంటి చిరు వ్యాపారుల మనుగడ కష్టమవుతుందని, ఇది పరోక్షంగా ప్రతి ఒక్కరి వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భారీ లాభాలను జేబుల్లో నింపుకుందని, ఇప్పుడు ధరలు పెరగ్గానే ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని రాహుల్ విమర్శించారు. గ్యాస్ ధరల పెంపు కేవలం ఆరంభం మాత్రమేనని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఖరీదైపోతాయని ఆయన జోస్యం చెప్పారు. సామాన్యులను దోచుకుని, ద్రవ్యోల్బణ భారాన్ని ప్రజలపై వదిలేసే సంస్కృతి మోదీ ప్రభుత్వానిదని ఆయన ధ్వజమెత్తారు.









