ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్ల డిమాండ్: టీఎంసీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన నిజాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మనోజ్ తివారీ పార్టీలోని అంతర్గత అవినీతిని బయటపెట్టారు. తనకు శిబ్‌పుర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడానికి అసలు కారణం, తాను రూ. 5 కోట్ల లంచం ఇవ్వకపోవడమేనని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 70 నుండి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 5 కోట్లు చెల్లించి టికెట్లు కొనుక్కున్నారని, తాను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే పార్టీ తనను పక్కన పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో క్రీడాశాఖ సహాయ మంత్రిగా పనిచేసినప్పటికీ, అది కేవలం ఒక “లాలీపాప్” పదవి లాంటిదని, తనకు ఎటువంటి అధికారాలు లేవని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబినెట్ మంత్రి అరూప్ బిశ్వాస్ తనను కనీసం క్రీడా వేడుకల వేదికపైకి కూడా పిలిచేవారు కాదని, చివరకు లియోనెల్ మెస్సీ కోల్‌కతా వచ్చిన కార్యక్రమానికి కూడా తనను రానివ్వలేదని పేర్కొన్నారు. ఏదైనా సమస్యను మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్దామంటే మాట్లాడే అవకాశమే ఇచ్చేవారు కాదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం శూన్యమని విమర్శించారు.

తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక, సొంత డబ్బులతో కొన్ని రోడ్లు వేశానని తివారీ తెలిపారు. ఐపీఎల్, టీమిండియా తరఫున ఆడి కోట్లాది రూపాయల తెల్లధనాన్ని ఆర్జించిన తనకు వసూళ్ల డబ్బు అవసరం లేదని, కానీ కొందరు కౌన్సిలర్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మమతకు లేఖలు రాశారని స్పష్టం చేశారు. టీఎంసీలో అవినీతి కూరుకుపోయిందని, అందుకే ఆ పార్టీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు