తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: డీఎంకేకు కాంగ్రెస్ గుడ్‌బై.. విజయ్ టీవీకేతో పొత్తు!

తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. దశాబ్ద కాలానికి పైగా డీఎంకేతో కొనసాగిన బంధానికి కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలికింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ పరిణామం డీఎంకే కూటమిలో తీవ్ర కలకలం రేపింది.

కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీ కోశాధికారి టీఆర్ బాలు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ తీరును ‘అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట’గా అభివర్ణించారు. రాహుల్ గాంధీ తమ పార్టీ అధినేత స్టాలిన్‌ను ‘బ్రదర్’ అని పిలుస్తూనే, వెన్నుపోటు పొడిచారని ఆయన ఆక్షేపించారు. బీజేపీ ఏ విధంగా అయితే అప్రజాస్వామికంగా అధికార దాహంతో వ్యవహరిస్తుందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని మండిపడ్డారు.

గతంలో క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన విషయాన్ని, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ మొదటగా ప్రకటించిన సందర్భాన్ని బాలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటమి తమకు కొత్త కాదని, మోసం అంతకన్నా కొత్త కాదని పేర్కొంటూ.. డీఎంకే కూటమిని నమ్మి ఓటు వేసిన ప్రజలను కాంగ్రెస్ నిలువునా వంచించిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమిళనాడులో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు