రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు గడిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఫీజులు 50 నుండి 120 శాతం వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కవిత విమర్శించారు. తమిళనాడు లేదా గుజరాత్ తరహాలో ఫీజుల నియంత్రణకు శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించేలా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని, తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడకుండా అడ్డుకోవాలని సూచించారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) వ్యవహారంపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఈ స్కూల్‌లో ఫీజులను భారీగా పెంచడమే కాకుండా, అక్కడ ఉన్న 30 ఎకరాల భూమిని కొట్టేయాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సత్య నాదెళ్ల వంటి ప్రముఖులు ఇచ్చే విరాళాలకు సరైన లెక్కలు లేవని, ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.









