హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలబెట్టడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తన ఢిల్లీ పర్యటన నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిచిపోవడాన్ని గమనించిన సీఎం, వెంటనే డీజీపీ సీవీ ఆనంద్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వీఐపీల కదలికల వల్ల సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలగకూడదని సీఎం స్పష్టం చేశారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలోనే కాకుండా, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా నిలిపివేయడం ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, ఒక వైపు నుంచి సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విమానాశ్రయ మార్గాల్లో రద్దీ పెరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని మరియు వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ పోలీసులను ఆదేశించారు.









