రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలపై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మే 15 నుంచే సాగునీరు విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, రైతులకు విత్తన సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. విత్తనాల కొనుగోలు మరియు పంపిణీ కోసం తక్షణమే రూ.200 కోట్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

పంటలకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ ప్రక్రియను అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో మెరుగైన ధరలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలని, సేంద్రీయ సాగుకు అవసరమైన కంపోస్టు ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో రాబోయే సీజన్‌కు సంబంధించి 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. మొక్కజొన్న వంటి పంటల నుండి ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని, మామిడి కొనుగోలుకు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లను సమన్వయం చేయాలని ఆదేశించారు. మత్స్యకారుల కోసం సీజన్ కంటే ముందే ఫిష్ సీడ్ సరఫరా చేయాలని, నాణ్యమైన దిగుబడుల ద్వారా రైతులకు లాభసాటి వ్యవసాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు