తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్‌కు అవసరమైన బలం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ పార్టీ 108 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ, మెజారిటీకి ఇంకా ఆరు సీట్లు తక్కువ పడుతుండటంతో అన్నాడీఎంకే మద్దతుపై జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారానికి అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తెరదించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు సీట్లు తక్కువయ్యాయా లేదా అనే అంశంతో తమకు సంబంధం లేదని మునుసామి స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ టీవీకేకు తాము సహకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సుమారు 30 మంది విజయ్‌కు మద్దతివ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, పార్టీ అధినేత పళనిసామి మాత్రం ఇందుకు సుముఖంగా లేరని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.
ప్రస్తుతం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ మాత్రమే విజయ్‌కు బాసటగా నిలిచింది. కానీ వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు మద్దతుకు ససేమీరా అంటున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్ ఎలా కూడగడతారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే తన వైఖరిని స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇతర చిన్న పార్టీలు మరియు స్వతంత్రులపై పడింది.









