ఇన్ని సినిమాలు తీశాడు.. ఇప్పటికీ సుకుమార్‌కి కథ చెప్పడం రాదు: జగపతిబాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’ ప్రమోషన్లలో భాగంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. సుకుమార్ అద్భుతమైన సినిమాలు తీస్తారనడంలో సందేహం లేదు కానీ, ఆయనకు కథ వివరించడం (నరేషన్) మాత్రం అస్సలు రాదని జగ్గుభాయ్ సరదాగా ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా అంగీకరిస్తారని ఆయన నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో జగపతిబాబు అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆ సినిమాల కథా చర్చల గురించి చెబుతూ.. ‘నాన్నకు ప్రేమతో’ కథ చెప్పడానికి సుకుమార్ చాలా తడబడ్డారని, చివరకు ఏమీ చెప్పలేక ‘సార్.. ఇవన్నీ కాదు, మీరు చేసేయండి’ అని అన్నారని తెలిపారు. అలాగే ‘రంగస్థలం’ కథను వివరించడానికి గంటన్నర పాటు యోగా చేసి వచ్చి, తీరా కథను మాత్రం కేవలం ఒక్క నిమిషంలోనే ముగించారని వెల్లడించారు. ‘చొక్కా ఉండదు సార్, చుట్ట ఉంటుంది సార్.. బావుంటుంది సార్’ అని సుక్కు చెప్పిన మాటలు తనను ఇంప్రెస్ చేశాయని ఆయన చెప్పుకొచ్చారు.

దర్శకుడిపై ఉన్న అచంచలమైన నమ్మకంతోనే వివరాలు అడగకుండా తాను సినిమాలు చేస్తానని జగపతిబాబు స్పష్టం చేశారు. హీరోగా దశాబ్దాల పాటు అలరించిన ఆయన, ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘గోదారి గట్టుపైన’ చిత్రం మే 8న విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమాతో జగ్గుభాయ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు