తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు టీటీడీ పాలకమండలి తీపి కబురు అందించింది. అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ కారణంగా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిని గమనించిన టీటీడీ, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 4.25 కోట్లతో బస్సుల తనిఖీ కోసం ప్రత్యేక లైన్లు మరియు శాశ్వత షెడ్లను నిర్మించే ప్రతిపాదనలకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా అలిపిరి వినాయక స్వామి ఆలయ సమీపంలో రెండు ప్రత్యేక బస్సు లైన్లను 3.75 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇక్కడ ఒకేసారి సుమారు 80 బస్సులు ఆగేలా ప్రణాళికలు రూపొందించారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం రూ. 2.02 కోట్లతో అత్యాధునిక శాశ్వత షెడ్లను 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ గణనీయంగా తగ్గి భక్తుల ప్రయాణం మరింత సులభతరం కానుంది.
కేవలం షెడ్ల నిర్మాణంతోనే ఆగకుండా అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేయనున్నారు. కొత్త తనిఖీ లైన్ల వద్ద లగేజీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు మరియు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఆర్‌సీసీ రిటెయినింగ్ వాల్‌తో పాటు, రాత్రి సమయాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా లైటింగ్ మరియు యూపీఎస్ సౌకర్యాలను కూడా కల్పించనున్నారు. ఈ కీలక నిర్ణయంతో సాధారణ రోజుల్లోనే కాకుండా బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల్లో కూడా భక్తులు నిరీక్షణ లేకుండా తిరుమలకు చేరుకోవచ్చు.









