అమరావతిలోని సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించి, పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములు మరియు కొండ ప్రాంతాలలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క విజయవాడలోనే 60 వేల మందికి, విశాఖపట్నంలో 30 వేల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించి, సామాన్యుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని కలెక్టర్లకు సూచించారు. కొత్తగా ఇళ్ల స్థలాలు అవసరమయ్యే సుమారు 2 లక్షల మంది కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయించాలని ఆదేశించారు.
సామాజిక సాధికారతలో భాగంగా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని, అంతవరకు వారికి ఉద్యోగ మినహా మిగిలిన అన్ని ఎస్సీ సంక్షేమ ఫలాలను వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు భూముల్లో ‘రూరల్ ఆటోనగర్’లను నిర్మించి, వాటిని ఉపాధి హబ్‌లుగా మార్చాలని ప్రతిపాదించారు. వీటితో పాటు వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ను సమీక్షించిన చంద్రబాబు, పరిపాలనలో పారదర్శకత పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను కోరారు.









