హైదరాబాద్‌లోని మూసీ నది పునరుజ్జీవనం మరియు సుందరీకరణ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచే ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను (DPR) మంత్రులకు అందజేశారు. ఈ ప్రాజెక్టును ఐదు దశల్లో మొత్తం 55 కిలోమీటర్ల మేర చేపట్టనుండగా, తొలి దశలో రూ. 7,055 కోట్లతో పనులు నిర్వహించాలని నిర్ణయించారు.
తొలి దశ పనులను ఆగస్టులో ప్రారంభించి డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి బాపుఘాట్ వరకు పనులు నిర్వహించనున్నారు. నిర్మాణాలపై ప్రభావం తక్కువగా ఉండేలా ఐదు కిలోమీటర్ల మేర పనులు మొదలుపెట్టాలని, అవసరమైతే అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ఈ పనుల కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB)తో చర్చలు కూడా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజా భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని, ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదిలోని చెత్తను తొలగించడం, రివర్ బెడ్ ప్రొఫైలింగ్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నదికి రెండు వైపులా రహదారులు, మురుగు కాలువలు, బ్యారేజీలు మరియు రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి కీలక పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా ఈ సుందరీకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.









