మంచు మనోజ్ భావోద్వేగ సందేశం: ‘విజయ్ అన్నకు హృదయపూర్వక అభినందనలు’

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవడంతో, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్‌ను ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆయన సాధించిన చారిత్రక విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారని మనోజ్ పేర్కొన్నారు. మార్పు కోసం ప్రజలు ఏకం అయినప్పుడు చరిత్ర గతి కూడా మారుతుందని, ప్రజా తీర్పు ముందు చరిత్ర కూడా తలవంచాల్సిందేనంటూ ఆయన తన పోస్ట్‌లో ఎమోషనల్ అయ్యారు.

తమిళనాడులో సాగిన రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైందని, ఆయనకు వామపక్షాలతో పాటు వీసీకే (VCK) పార్టీలు మద్దతు ప్రకటించాయని మనోజ్ వివరించారు. మ్యాజికల్ ఫిగర్ 118ని అందుకున్న విజయ్, అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించడం ఒక చారిత్రక ఘట్టమని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఎప్పుడూ రాజకీయ లెక్కల కంటే పైస్థానంలోనే ఉండాలని, అతిపెద్ద పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశం దక్కడం శుభపరిణామమని మనోజ్ అభిప్రాయపడ్డారు.

విజయ్‌ను తన సోదరుడిగా సంబోధిస్తూ, ఈ విజయం కేవలం ఒక్క వ్యక్తిది కాదని, మార్పు కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి దక్కిన విజయమని మనోజ్ పేర్కొన్నారు. తమిళనాడు ఎప్పుడూ తమ హృదయాల్లో నాయకులను మోసే వ్యక్తులను ఆదరిస్తుందని, ‘విజయ్ దళపతి’ అనే పేరు ఇప్పుడు సామాన్యుడి ఆశకు ప్రతీకగా మారిందని ఆయన రాసుకొచ్చారు. తానొక దళపతి అభిమానినని గర్వంగా చెప్పుకుంటూ, ‘జననాయగన్ విజయ్’ ఫోటోను పంచుకుని తన మాతృభూమి తమిళనాడుకు ‘వణక్కం’ తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు