విజయ్ ముఖ్యమంత్రి పట్టాభిషేకం ఖాయం: మద్దతు లేఖ అందించిన వీసీకే

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సందిగ్ధతకు ముగింపు పలుకుతూ, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. శనివారం సాయంత్రం వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ మద్దతు లేఖను టీవీకే కీలక నేత ఆదవ్ అర్జునకు అందజేశారు. ఈ కీలక పరిణామంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం 119కి చేరుకుంది, ఇది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ.

సుదీర్ఘ చర్చల అనంతరం, ప్రభుత్వంలో భాగస్వామ్యం మరియు కేబినెట్‌లో ప్రాధాన్యతపై విజయ్ నుండి స్పష్టమైన హామీ పొందిన తర్వాతే వీసీకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదవ్ అర్జున గతంలో వీసీకేలో పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆయన చేసిన మధ్యవర్తిత్వం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం విజయ్ పక్షాన 119 మంది ఎమ్మెల్యేలు (టీవీకే 108, కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, వీసీకే 2) ఉండటంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు లాంఛనమే.

మద్దతు లేఖలతో విజయ్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే మూడుసార్లు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన, ఈసారి సంపూర్ణ మెజారిటీతో కూడిన లేఖను సమర్పించనున్నారు. అన్నీ అనుకూలిస్తే, రేపు (ఆదివారం) లేదా ఎల్లుండి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఒక స్టార్ హీరోగా వెండితెరను ఏలిన విజయ్, ఇప్పుడు పక్కా రాజకీయ వ్యూహాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన ఘట్టంగా నిలవనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు