తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా విదేశీ విద్యా పద్ధతులను అధ్యయనం చేసేందుకు 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్‌కు పంపించామని వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘విద్యావారోత్సవాల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే మరిన్ని దేశాలకు టీచర్లను పంపించి ఉత్తమ విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మబట్టే విద్యాశాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఎటువంటి వివాదాలు లేకుండా 36 వేల మంది టీచర్ల బదిలీలను పూర్తి చేశామని గుర్తు చేశారు. విద్యాశాఖకు కేటాయించే నిధులను 15 శాతానికి పెంచుతామని, ప్రభుత్వ పాఠశాలలు ఫలితాల్లో ప్రైవేటుకు దీటుగా రాణించేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం మరియు డ్రాపవుట్ల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. కుల వివక్షను నిర్మూలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని, కాలం చెల్లిన సిలబస్‌ను మార్చి ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా విద్యాబోధన సాగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను ప్రతి పేద బిడ్డకు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.









