ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించనుంది. ఆడపిల్లల వివాహాన్ని ఆర్థిక భారంగా భావించకుండా, గౌరవప్రదంగా జరిపించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 23న ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సెర్ప్ (SERP), స్త్రీనిధి సంస్థల ఆధ్వర్యంలో అమలయ్యే ఈ స్కీమ్ ద్వారా డ్వాక్రా సభ్యుల కుమార్తెల పెళ్లి కోసం రూ. 10 వేల నుండి రూ. 1 లక్ష వరకు తక్కువ వడ్డీతో రుణ సాయం అందజేస్తారు.
ఈ పథకం కింద కేవలం 4 శాతం (పావలా) వడ్డీకే రుణం మంజూరు చేస్తారు. ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా, గరిష్టంగా 48 సులభ వాయిదాలలో (EMIs) ఈ అప్పును తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం రూ. 250 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రతి ఏటా సుమారు 25 వేల మంది డ్వాక్రా మహిళల కుటుంబాలకు మేలు చేకూరనుంది.
కనీసం ఆరు నెలలుగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండి, తీసుకున్న పాత రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారులు స్థానిక వెలుగు ఆఫీస్ లేదా యానిమేటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లి కార్డు, లగ్న పత్రిక వంటి పత్రాలను సమర్పించి బయోమెట్రిక్ పూర్తి చేసిన 48 గంటల్లోనే నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయబడుతుంది. దీనివల్ల అత్యవసర సమయంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం తప్పుతుంది.









