ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తున్న సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు సుమారు రూ. 652 కోట్ల మేర నష్టపోయారని అధికారులు వెల్లడించగా, పరిస్థితి తీవ్రతపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ‘1930’ టోల్ ఫ్రీ నెంబర్‌కే 9.29 లక్షల ఫిర్యాదులు అందడం గమనార్హం. ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలు (ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్) అతిపెద్ద సవాలుగా మారాయని ఈ సమావేశంలో చర్చించారు.
నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే పటిష్టమైన ‘యాక్షన్ ప్లాన్’ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఐడీ, బ్యాంకింగ్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఇప్పటివరకు రూ. 116 కోట్లను కాపాడగలిగారని, ఇదే తరహాలో ‘గోల్డెన్ అవర్’లో స్పందన మరింత వేగంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల కట్టడికి ఒక సమగ్రమైన ‘ఏపీ సైబర్ పాలసీ’ని తీసుకురావాలని, నేరగాళ్లు ఇతరుల బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. కొత్త రకం నేరాలుగా మారిన ‘డిజిటల్ అరెస్ట్’, ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి, సీఐడీ చీఫ్ మరియు ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొని, టెక్నాలజీ సాయంతో నేరగాళ్లను పట్టుకునేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించారు.









