బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత డిమాండ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఘాటుగా స్పందించారు. భగీరథ్ దేశం దాటి వెళ్లకుండా పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తండ్రిగా ఉండి, బండి సంజయ్ ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకోవడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిందని ఆమె విమర్శించారు. ఒకవేళ కుమారుడి నేరం రుజువైతే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని కవిత ఆక్షేపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం మన నీటి వాటా కోసం గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే కులగణనలో ఓబీసీ కాలమ్ తప్పనిసరిగా ఉండాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు.

జాతీయ స్థాయి పరీక్షలైన నీట్ (NEET) పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కవిత హెచ్చరించారు. బాధితురాలిని అవమానించేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసి, వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసి, ప్రజల పక్షాన నిలబడటానికే తెలంగాణ రక్షణ సేన పుట్టిందని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు