హైదరాబాద్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ (H-1B), ఓపీటీ వంటి వీసా కార్యక్రమాలు అంతర్జాతీయ ‘వీసా మాఫియా’కు అడ్డగా మారాయని, దీని వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో చిలుకూరు ఆలయ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇది “వీసా కార్టెల్ గుడి” అని, వేలాది మంది భారతీయులు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ అమెరికా వీసాల కోసం ఆశీర్వాదం పొందుతున్నారని ఎరిక్ ష్మిట్ తన అక్కసు వెళ్లగక్కారు.
మిస్సోరీ సెనేటర్ అయిన ఎరిక్ ష్మిట్, భారతీయులు మరియు తెలుగువారిపై తన పోస్ట్‌లలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపాధి ఆధారిత వీసా వ్యవస్థ స్థానిక వేతన వ్యవస్థలపై ఒత్తిడి తెస్తోందని, తక్కువ వేతనాలకు పని చేసే విదేశీయుల వల్ల అమెరికా గ్రాడ్యుయేట్లు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కొల్లగొట్టడమే కాకుండా, వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నల వివరాలను కూడా ఈ ‘మాఫియా’ దరఖాస్తుదారులతో పంచుకుంటోందని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానాలకు మద్దతుగా ఆయన ఈ వరుస పోస్ట్‌లు పెట్టడం గమనార్హం.
మరోవైపు, భారతీయ విద్యార్థులను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులే ఉన్నారని, వారు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో రాయితీలు పొందుతూ వర్క్ పర్మిట్లు సాధిస్తున్నారని విమర్శించారు. పెద్ద టెక్ సంస్థల్లో ప్రతిభ కంటే జాతి పక్షపాతానికే ప్రాధాన్యత దక్కుతోందని, తద్వారా అమెరికన్లకు దారులు మూసుకుపోతున్నాయని ష్మిట్ మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని వీసా మాఫియాతో ముడిపెట్టి సెనేటర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.









