ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి పలికి, ఇకపై ‘జనాభా నిర్వహణ’ అనే కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మారకుండా ఉండాలంటే యువశక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, పిల్లలు భారం కాదు.. వారు రాష్ట్రానికి అసలైన సంపద అని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో జనాభాను పెంచేందుకు ప్రభుత్వం తరఫున భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను చంద్రబాబు ప్రకటించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే రూ. 30,000, నాలుగో బిడ్డ జన్మిస్తే రూ. 40,000 చొప్పున నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం నగదు సాయమే కాకుండా, ఆ పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, విద్యా వసతుల కోసం ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సరికొత్త పథకాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో తానే జనాభా నియంత్రణకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇచ్చే రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని కూడా భవిష్యత్తులో మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. చిన్న కుటుంబాల ధోరణి వల్ల పని చేసే యువత తగ్గిపోయి ఉత్పాదకత దెబ్బతింటుందని, ఇళ్లలో మళ్లీ పిల్లల కిలకిలరావాలు వినిపించినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పేర్కొంటూ, తల్లులందరూ ఈ దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.









