వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు: ప్రమాదకరమైన కుక్కలకు కారుణ్యమరణం!

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల స్వైరవిహారం, కుక్క కాట్ల మరణాలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. ఈ సమస్యపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాలకు, మున్సిపల్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కుక్కల దాడుల వల్ల పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. భయం లేకుండా, గౌరవప్రదంగా బతికే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేస్తూ.. వీధి కుక్కల నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ తీర్పులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. పిచ్చి పట్టిన, నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న లేదా అత్యంత ప్రమాదకరంగా మారి మనుషులపై దాడులు చేస్తున్న కుక్కలను చంపేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం, పశువైద్యుల పర్యవేక్షణలో అటువంటి కుక్కలకు కారుణ్యమరణం (Euthanasia) ప్రసాదించవచ్చని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పుడు జంతువులపై దయ చూపడం కంటే పౌరుల రక్షణకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే గతంలో ఇచ్చిన తీర్పును సవరించాలని జంతు ప్రేమికులు కోరిన పిటిషన్లను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.

ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులు, పాఠశాలలు, విద్యాసంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కలు అస్సలు ఉండటానికి వీల్లేదని న్యాయస్థానం ఖరాకండిగా తేల్చి చెప్పింది. ఒకవేళ వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ (కుక్కల నియంత్రణ ఆపరేషన్) చేసినా.. వాటిని తిరిగి అవే రద్దీ ప్రాంతాల్లో వదిలిపెట్టకూడదని, వాటి కోసం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై కోర్టు ధిక్కరణ (Contempt of Court) చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు