మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ: ఫాల్తా రీ-పోలింగ్‌కు ముందే తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా రీ-పోలింగ్ జరగనున్న ఫాల్తా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి, మమతకు అత్యంత నమ్మినబంటు అయిన జహంగీర్ ఖాన్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సాగిన టీఎంసీ పాలనకు తెరదించుతూ బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ఇప్పుడు రీ-పోలింగ్ ముంగిట అధికారిక అభ్యర్థే తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి బలమైన కంచుకోటగా భావించే డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోని ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న రెండో దశలో పోలింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగడం, ఈవీఎంలలోని బీజేపీ గుర్తుపై టేపులు వేసి ఓటర్లను అడ్డుకున్నారనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో గత ఓటింగ్‌ను రద్దు చేసి, మే 21న పూర్తిస్థాయిలో రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ తరుణంలో సువేందు అధికారి ఇచ్చిన హామీల మేరకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పోటీ నుంచి తప్పుకున్న అనంతరం జహంగీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తానేమీ ఎవరి ఒత్తిడికో, భయానికో లొంగి ఈ నిర్ణయం తీసుకోలేదని, తన సొంత నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసమే తప్పుకున్నానని స్పష్టం చేశారు. నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్తా ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని, ఇక్కడ శాంతిభద్రతలు వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టీఎంసీ అభ్యర్థి తప్పుకోవడంతో ఇప్పుడు ఇక్కడ బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా విజయం దాదాపు ఖాయం కాగా.. కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. మే 21న కట్టుదిట్టమైన పారామిలటరీ భద్రత నడుమ రీ-పోలింగ్ జరగనుండగా, మే 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు