ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముందు లోకేష్‌కు చెప్పు: చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న ‘ఎక్కువ సంతానం’ కాన్సెప్ట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంతానమే సంపద అంటూ ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునివ్వడం ఒక దిక్కుమాలిన ఆలోచన అని ఆయన కొట్టిపారేశారు. మహిళలను పిల్లలను కనే మిషన్లుగా చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, ఇలాంటి సలహాలు ముందు తన ఇంట్లో ఉన్న కుమారుడు లోకేష్‌కు ఇవ్వాలని, అప్పుడే ప్రజలు పాటిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఒక్కడే కొడుకని, లోకేష్‌కు కూడా ఒక్కడే కొడుకని గుర్తు చేస్తూ.. బాబు చెప్పే మాటలు కనీసం ఆయన సొంత కుటుంబ సభ్యులైనా పాటించాలి కదా అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బోత్ ఆర్ నాట్ సేమ్’ (Both are not same) అంటూ నారా లోకేష్ శైలిలోనే జగన్ కౌంటర్ ఇచ్చారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కుని, అబద్ధపు హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబుది అయితే.. ప్రజల మద్దతుతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర తమదని చెప్పారు. ప్రజలను వాడుకుని వదిలేయడం కూటమి క్యారెక్టర్ అయితే, బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు మేలు చేయడం తమ స్టైల్ అని పేర్కొన్నారు. తమ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ఎన్నడూ మూలన పడలేదని, ఇవాళ కనీసం పిల్లలకు గోరుముద్దలు కూడా సరిగ్గా అందడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో అధికారుల తీరుపై మరియు సోషల్ మీడియాపై జరుగుతున్న ఆంక్షలపై కూడా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతోనో లేదా ప్రలోభాలకు లోనయ్యో తప్పులు చేస్తున్న పోలీసులను, అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారు సప్తసముద్రాల అవతల ఉన్నా సరే చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. అలాగే, ఏపీలో సోషల్ మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కంటెంట్‌ను సెన్సార్ చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ, ఎఫ్‌ఐఆర్ కాపీలను నేరుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు పంపిస్తూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు