మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లీమిటెడ్ (SAEL) వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రతిపక్షాలపై పరోక్షంగా ఘాటు విమర్శలు గుప్పించారు. “మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్ (ఉద్యోగాల కల్పన) అయితే… మీ బ్రాండ్ గొడ్డలి” అంటూ వ్యాఖ్యానించారు. ఒక ప్రాజెక్టు ప్రారంభమవ్వడమంటే కేవలం రిబ్బన్ కటింగ్ కాదని, అది దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణల కలయిక అని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన విజయవంతం కావడానికి ‘బ్రాండ్ సీబీఎన్’ పై ఉన్న నమ్మకం, వేగంగా నిర్ణయాలు తీసుకునే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం మరియు కేంద్ర-రాష్ట్రాల ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ మద్దతులే ముఖ్య కారణాలని లోకేష్ వివరించారు. స్థానిక రైతులు, యువత సహకారం వల్లే 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టు కేవలం 11 నెలల రికార్డు సమయంలో పూర్తయిందని, నేడు రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తోందని కొనియాడారు. ఇక్కడ మెగా సోలార్ పార్క్, అదానీ, చింతా గ్రీన్, జెన్‌కో–ఎన్టీపీసీ ప్రాజెక్టులతో పాటు ఈ ఎస్ఏఈఎల్ ప్రాజెక్టును కూడా తీసుకువచ్చింది తమ ప్రభుత్వమేనని, కంపెనీలు తేవాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది బ్రాండ్ చంద్రబాబుకే సాధ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచంతో పోటీపడేలా ఏపీలో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చని, ఇక్కడ ఉత్పత్తి అయ్యే క్లీన్ ఎనర్జీని 25 ఏళ్ల ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేస్తామని లోకేష్ వెల్లడించారు. దీనివల్ల ఏపీ దేశానికే విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని చెప్తూ.. ఎస్ఏఈఎల్ బృందాన్ని “తుస్సీ కమాల్ కర్ దిట్టా… చక్ దే ఫట్టే!” అంటూ పంజాబీలో అభినందించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1,000 మందికి పైగా ఉపాధి లభించగా అందులో 80 శాతం స్థానికులేనని, అలాగే లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతులకు స్థిరమైన ఆదాయం చేకూరిందని తెలిపారు. ఇన్వెస్టర్లకు ఏ సహాయం కావాలన్నా తాను “ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే” ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు