బండి భగీరథ్ కేసు అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ చెబుతుంటే, పోలీసులే అతడిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకరు లొంగుబాటు అని, మరొకరు అరెస్టు అని పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ తోడు దొంగలని, ప్రజలను నమ్మించడానికి కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నానని, కానీ బుర్ర కూడా చాలా తక్కువేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ ఇప్పించేందుకు తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయని, అయితే హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు రాలేదని కేటీఆర్ వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలైన ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, ఆ నిస్సహాయురాలి వివరాలను బహిర్గతం చేసింది స్వయంగా బీజేపీ నేతలేనని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఉన్న 15 మంది నిందితులూ బీజేపీకి చెందినవారేనని స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి ‘చావు కబురు చల్లగా చెప్పినట్లు’ మాట్లాడారని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా వాడకం తగ్గించాలని, ప్రజలు బంగారం కొనడం తగ్గించాలని ప్రధాని చెప్పడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరించడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం, వచ్చే రైతు సీజన్‌లో కూడా అన్నదాతలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో రైతుల కోసం గన్నీ బ్యాగులు (సంచులు) దొరకడం లేదు కానీ, శాంతిభద్రతల వైఫల్యం వల్ల గన్‌లు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరును తీవ్రంగా తప్పుపట్టారు.









