సంపద కంటే ఆరోగ్యమే గొప్పది: ‘సంజీవని’ వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు; ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభం!

చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగలో నిర్వహించిన ‘సంజీవని’ ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య సంరక్షణపై కీలక ఉద్ఘాటన చేశారు. “ఆహారమే ఔషధం – వంటగది ఒక ఔషధశాల” అని పేర్కొంటూ, తన వరకు తాను పూర్తి ఆహార నియమాలు పాటిస్తానని వెల్లడించారు. సంపద ఉన్నవాళ్ల కంటే నిండు ఆరోగ్యంతో ఉన్నవాళ్లే అసలైన అదృష్టవంతులని, ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, వ్యాయామం ద్వారా మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధులు రాకముందే గుర్తించి నివారించేందుకు (ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్) వీలుగా డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ‘సంజీవని’ ప్రాజెక్టును రూపొందించినట్లు ఆయన వివరించారు.

గత జూలైలో కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అమలువుతున్న ఈ పథకాన్ని రాబోయే ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద ప్రజల ఇళ్ల వద్దే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించడమే కాకుండా, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ‘ఏఐ (AI) డాక్టర్’ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందేలా సాంకేతికతను జోడిస్తున్నామని స్పష్టం చేశారు. పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ధ్యేయంగా ఈ ఏడాది వైద్య రంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని, యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 2.5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆరోగ్యంతో పాటు పర్యావరణం, సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం చంద్రబాబు కీలక నివేదికలను ఉటంకించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణకు అన్నమయ్య జిల్లానే నిదర్శనమని, అక్కడ భూగర్భ జలాలు 8.5 మీటర్లు పెరగడం వల్లే రాష్ట్రమంతా ఎండలు మండుతున్నా అక్కడ మాత్రం ఉష్ణోగ్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక ‘ప్రాజెక్ట్ క్యాలెండర్’ విడుదల చేశామని స్పష్టం చేశారు. నీవా పనులను త్వరగా పూర్తి చేసి చిత్తూరు వరకు కృష్ణా జలాలను తరలిస్తామని, గాలేరు-నగరి, మల్లెమడుగు, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి రాయలసీమ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు