‘ఎవరెవరికి ఎంత అందిందో బయటపెట్టనా?’: ఆప్‌పై హర్బజన్ సింగ్ సంచలన ట్వీట్; రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు!

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు హర్బజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ నుండి ఆప్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన హర్బజన్ సింగ్, ఇటీవల తోటి ఎంపీలతో కలిసి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఫిరాయింపుపై సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ ప్రశ్నించగా బజ్జీ తీవ్రంగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా రాజ్యసభ సీట్లను అమ్ముకుందంటూ ఒక పెద్ద పొలిటికల్ బాంబ్ పేల్చారు. తనను ద్రోహి అని విమర్శించే వారు, ముందు తమ సొంత పార్టీ నేతలు రాజ్యసభ సీట్లను ఎంత మొత్తానికి అమ్ముకున్నారో అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

ఈ వ్యవహారంలో “సమయం వచ్చినప్పుడు ఎవరెవరు ఎంత తీసుకున్నారో, ఎవరి వైపు నుండి ఎంత ఇచ్చారో అన్ని వివరాలను తానే స్వయంగా బయటపెడతాను” అంటూ హర్బజన్ సింగ్ హెచ్చరించారు. ఆప్ మంత్రులు, అధికారులు కలిసి పంజాబ్ ప్రజలను దారుణంగా దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ.. ఆ నాయకుడికి పంజాబ్ పై నిజమైన ప్రేమ ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్న తరుణంలో హర్బజన్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

హర్బజన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి ఆప్‌ను ఇరకాటంలోకి నెట్టింది. పంజాబ్‌లో ఆప్ సాగిస్తున్న అవినీతి సామ్రాజ్యాన్ని వారి సొంత ఎంపీనే బట్టబయలు చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజ్యసభ సీట్లను ఎంతకు అమ్మారో, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాఘవ్ చద్ధా సహా ఏడుగురు ఆప్ ఎంపీలు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరడం, ఆపై హర్బజన్ ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆప్‌కు మరిన్ని చట్టపరమైన, రాజకీయ ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు