‘డిన్నర్‌కు వస్తా’ అని వెళ్లి.. న్యూజిలాండ్‌ రోడ్డు ప్రమాదంలో పంజాబ్ యువకుడు దుర్మరణం!

ఉపాధి కోసం వెళ్లి అనంత లోకాలకు:

విదేశాల్లో స్థిరపడి, ఎన్నో కలలతో ఒక అందమైన సంసారాన్ని నిర్మించుకుంటున్న ఒక భారతీయ ప్రవాసి కుటుంబంలో ఊహించని రోడ్డు ప్రమాదం పూడ్చలేని తీవ్ర శోకాన్ని నింపింది. “రాత్రి భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తా” అని భార్యకు చెప్పి వెళ్లిన సదరు యువకుడు.. కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. న్యూజీలాండ్‌లోని పాపామోవా ప్రాంతంలో రాత్రి వేళ ఉబర్ (Uber) క్యాబ్ నడుపుతుండగా జరిగిన ఘోర ప్రమాదంలో భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ సింగ్ ధిల్లాన్ (36) అనే భారతీయ యువకుడు మరణించాడు. ఈ విషాద ఘటన స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.

కుమార్తె కోసం మారిన కెరీర్ – అంతలోనే ప్రమాదం:

ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో రమణ్‌దీప్ 2015లో స్టూడెంట్ వీసాపై న్యూజీలాండ్ వెళ్లాడు. అనంతరం 2024లో స్వదేశానికి వచ్చి వీర్‌పాల్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు ఇద్దరూ పాపామోవాలో స్థిరపడి, మొదట్లో కివీఫ్రూట్ తోటల్లో కూలీలుగా పని చేసేవారు. వీరికి ప్రస్తుతం 18 నెలల (ఏడాదిన్నర) కుద్రత్ అనే కుమార్తె ఉంది. అయితే పాప పుట్టిన తర్వాత ఆమెను చూసుకోవడానికి సమయం కలిసి వస్తుందని రమణ్‌దీప్ పార్ట్ టైమ్‌ ఉబెర్ డ్రైవర్‌గా మారాడు. గత బుధవారం రాత్రి పికప్ కోసం వెళ్లిన క్రమంలో.. ‘టే పుకే హైవే’పై ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరొక వాహనం బలంగా ఢీకొట్టడంతో రమణ్‌దీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దిక్కుతోచని స్థితిలో వండ్రప్ కుటుంబం – దాతల ఊరట:

రోజులాగే భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యకు.. అర్ధరాత్రి దాటాక పోలీసులు వచ్చి ఈ ఘోర నిజాన్ని తెలపడంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా బద్దలైపోయింది. ప్రస్తుతం తండ్రి లేడనే స్పృహ కూడా లేని ఆ ఏడాదిన్నర చిన్నారి, నిరంతరం తండ్రి ఎక్కడంటూ వెతుకుతుండటం అక్కడి వారిని కన్నీరు పెట్టిస్తోంది. కాగా, న్యూజీలాండ్‌లోని వివిధ నగరాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు తరలివచ్చి రమణ్‌దీప్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయిన ఆ తల్లిని, చిన్నారిని ఆదుకునేందుకు స్థానికంగా ‘గివాలీటిల్’ (Givealittle) అనే క్రౌడ్ ఫండింగ్ పేజీని ఏర్పాటు చేయగా, వారి దైనందిన అవసరాల కోసం ఇప్పటి వరకు దాతలు దాదాపు 33,000 డాలర్ల (సుమారు రూ.27 లక్షలకు పైగా) విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు