విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ జోస్యం:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) విజయం సాధించి, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదని, కేవలం రెండేళ్లు కూడా కొనసాగడం కష్టమని ప్రతిపక్ష డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన జోస్యం చెప్పారు. శనివారం జరిగిన డీఎంకే యువజన విభాగం నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినీ గ్లామర్ వల్లే టీవీకే గెలిచిందని, ఇది రాజకీయ చైతన్యం ఏ మాత్రం కాదని విమర్శించారు. ఈ సినీ గ్లామర్ ఆకర్షణ కేవలం తాత్కాలికమేనని, ప్రజలు కొద్దిరోజుల్లోనే మళ్లీ డీఎంకేను వెతుక్కుంటూ వస్తారని, కార్యకర్తలంతా మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఉదయనిధికి కీలక సలహాలు – సోషల్ మీడియా యాక్షన్ ప్లాన్:
ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అనుగుణంగా డీఎంకే యువజన విభాగం సోషల్ మీడియాలో మరింత చురుగ్గా పనిచేయాలని స్టాలిన్ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం కేవలం ఇతరుల పోస్టులను షేర్ చేయడం కాకుండా, సొంతంగా క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేసేలా యూత్ వింగ్ కార్యకర్తలకు ప్రత్యేక వర్క్‌షాపులను నిర్వహించాలని తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ వెన్నుపోటుపై ఉదయనిధి ఆగ్రహం:
ఇదే సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ (సాధారణ మెజార్టీ) దాటని టీవీకే, తమ కూటమిలోని మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలతోనే అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా తమతో కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీ, పదవుల ఆశతో కనీస కృతజ్ఞత లేకుండా తమను వెన్నుపోటు పొడిచి విజయ్ సర్కారుకు మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. తమిళనాడులో డీఎంకే అండవల్లే కాంగ్రెస్‌కు ఐదు ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆయన.. కనీస రాజకీయ నాగరికత లేని కాంగ్రెస్ పార్టీని ఇకపై నమ్మే ప్రసక్తే లేదని, వారికి రాబోయే రోజుల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.









