రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, రవిశంకర్, సాహు గారపాటి తదితరులు మంగళవారం కలిశారు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, సినీ పరిశ్రమలోని పలు సమస్యలను ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
నిర్వహణ వ్యయం, నెలవారీ ఖర్చులు పెరగడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని నిర్మాతలు పవన్ కల్యాణ్‌కు వివరించారు. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌లోనూ వచ్చిన లాభాల నుంచి ప్రొడ్యూసర్స్ పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తేనే థియేటర్లు నిలదొక్కుకుంటాయని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని, అలాగే విద్యుత్ ఛార్జీలలో రాయితీలు ఇచ్చి థియేటర్ల యాజమాన్యాలపై భారం తగ్గించాలని కోరారు.
నిర్మాతలు వినిపించిన సమస్యలపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తూ.. నిర్మాతల ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌కు సూచించారు. మరోవైపు, ఇదే సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజీ వివాదంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఎగ్జిబిటర్లు సోమవారం మెగాస్టార్ చిరంజీవిని కలిసి చర్చించగా.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చేలా ఛాంబర్ కమిటీ నివేదిక ఇచ్చేందుకు తన వంతు సాయం చేస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు.









