మా కుమార్తె కేసులో న్యాయం చేయండి.. జగన్‌ను వేడుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు!

గత తొమ్మిదేళ్లుగా తమ కుమార్తె కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. 2017లో తమ కుమార్తెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారని.. ఇన్నేళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని వారు జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. సీబీఐ విచారణ వేగవంతమయ్యేలా తమకు న్యాయ సహాయం అందించాలని కోరారు.

ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలిచిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తమకు రావాల్సిన పెన్షన్‌ను కూడా స్థానిక అధికారులు నిలిపివేశారని, కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సాయం అడిగినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

బాధిత తల్లిదండ్రుల గోడును సావధానంగా విన్న వైఎస్ జగన్, సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసు విషయమై పార్టీ తరపున పూర్తి లీగల్ సపోర్ట్ (న్యాయ సహాయం) అందిస్తామని స్పష్టం చేశారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు చేసే పోరాటంలో భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందని జగన్ వారికి భరోసా కల్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు