అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ముగింపులో భాగంగా జైపూర్ విమానాశ్రయంలో జరిగిన వీడ్కోలు ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో, దౌత్య వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ నుండి భారత్‌లో పర్యటించిన అత్యున్నత దౌత్యవేత్త మార్కో రూబియోనే కావడం విశేషం. ఇరు దేశాల మధ్య వాణిజ్య సుంకాల విభేదాలను సరిదిద్దేందుకు భారత్ వచ్చిన ఆయన.. తన పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీలతో పాటు ఆగ్రా, జైపూర్‌లలోని చారిత్రక కట్టడాలను సందర్శించారు.
అయితే, జైపూర్ పర్యటన ముగించుకుని ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లే సమయంలో విమానాశ్రయంలో కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే వీడ్కోలు పలికారని, కనీసం సహాయ మంత్రులు కూడా హాజరు కాలేదంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై భిన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య వివాదాల నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగానికి భారత్ ఇచ్చిన గట్టి సందేశంగా దీనిని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా, అసలు ప్రచారంలో నిజం లేదని దౌత్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మార్కో రూబియో జైపూర్ పర్యటన కేవలం చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసమే జరిగిన వ్యక్తిగత పర్యటన (అనధికారిక పర్యటన) కావడమే దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయ దౌత్య నిబంధనల ప్రకారం.. ఒక విదేశీ ప్రతినిధి అధికారిక పర్యటన కాకుండా ఇలా నగరాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు హాజరు కావాల్సిన అవసరం లేదు. కేవలం స్థానిక రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం అధికారులు, ఆలిండియా స్థాయి అధికారులు మరియు విదేశాంగ శాఖ ప్రతినిధులు వీడ్కోలు పలికితే సరిపోతుంది. జైపూర్ ఎయిర్‌పోర్టులో కూడా పూర్తిగా అంతర్జాతీయ దౌత్య ప్రోటోకాల్ ప్రకారమే ఆలిండియా సర్వీస్ అధికారులు రూబియోకు వీడ్కోలు పలికారు. అయినప్పటికీ, బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కనీసం మంత్రి స్థాయి నేతలెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం దౌత్య వర్గాల్లో ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.









