తెలంగాణకు చంద్రబాబు, లోకేశ్ నాయకత్వం అవసరం: మహానాడు వేదికగా టీడీపీ మహిళా నేత జ్యోత్స్న పిలుపు!

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికత కలిగిన నాయకుడి దిశానిర్దేశం ఎంతో అవసరమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. టీడీపీ వార్షిక పండుగ మహానాడు ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో, అభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా నారా లోకేశ్ లాంటి యంగ్, డైనమిక్ లీడర్ నాయకత్వం కూడా తెలంగాణకు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.

మహానాడు వేదికపై ‘తెలంగాణ విద్యాభివృద్ధి’ అనే కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన జ్యోత్స్న.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పోలుస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని, కానీ తెలంగాణలో కనీసం విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి కూడా లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తే, చంద్రబాబు ఐటీ విప్లవంతో విస్తృత అవకాశాలు కల్పించారని, ప్రస్తుతం లోకేశ్ యువత నైపుణ్యాలను (స్కిల్స్) తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆ నైపుణ్యాభివృద్ధిని తెలంగాణ యువతకు కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో గత 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడకుండా పసుపు జెండాను గుండెలకు హత్తుకుని నిలబడ్డారని జ్యోత్స్న భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ గడ్డపై టీడీపీ మళ్లీ పుంజుకుని, అధికారంలోకి రావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయ (టీచర్) పోస్టుల భర్తీని ఒక పక్కా జాబ్ క్యాలెండర్ ప్రకారం, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు