కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తన పదవికి చేసిన రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అధికారికంగా ఆమోదం తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అయితే, సీఎం పదవి నుంచి దిగిపోయిన మరుక్షణమే సిద్ధరామయ్య ఢిల్లీ వేదికగా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ముందు తన అనుచరుల కోసం, తన కుమారుడి భవిష్యత్తు కోసం డిమాండ్ల ‘విష్‌లిస్ట్’ ఉంచడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని సమర్పించిన వెంటనే సిద్ధరామయ్య తన ముఖ్య అనుచరులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో కీలక భేటీ నిర్వహించారు. డీకే శివకుమార్ నేతృత్వంలో త్వరలో ఏర్పాటు కాబోతున్న నూతన మంత్రివర్గ కూర్పుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునే వ్యూహంలో భాగంగా అధిష్ఠానం ముందు గట్టి నిబంధనలను ఉంచినట్లు పార్టీ వర్గాల ద్వారా స్పష్టమవుతోంది.
ఈ డిమాండ్ల జాబితాలో ప్రధానంగా తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు నూతన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి పదవులు కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. గతంలో డీకే శివకుమార్ పర్యవేక్షణలో ఉన్న జలవనరుల శాఖ లేదా వైద్య విద్య, పరిశ్రమలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల్లో ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోను తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తూ జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పటికీ.. తాను కర్ణాటకలోనే ఉంటూ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని సిద్ధరామయ్య సున్నితంగా తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాలపై ఆయనకున్న పట్టును స్పష్టం చేస్తోంది.









