ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా: కడప జిల్లాలో తప్పిన పెను ప్రమాదం, గేదె అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా వరుస రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, తాజాగా కడప జిల్లాలో మరో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. జిల్లాలోని గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దు ప్రాంతంలో బీసీవీఆర్ (BCVR) ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేటు బస్సు ఈ రోజు తెల్లవారుజామున నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ఈ బస్సు విజయవాడ నుండి బయలుదేరి అనంతపురం జిల్లా కదిరి వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద వివరాల్లోకి వెళితే.. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో ఒక గేదె అకస్మాత్తుగా రహదారిపైకి అడ్డుగా వచ్చింది. ఆ సమయంలో అప్రమత్తమైన డ్రైవర్ గేదెను ఢీకొట్టకుండా తప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు వేగానికి ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పూర్తిగా బోల్తా పడినప్పటికీ అదృష్టవశాత్తూ ఒక పెద్ద పెను ముప్పు తప్పిందని చెప్పాలి.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఒక ప్రయాణికుడి కాలికి మాత్రం తీవ్ర గాయమవగా, మరికొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను రక్షించి, తదుపరి వైద్య చికిత్స నిమిత్తం వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు