ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో రోడ్ల అనుసంధానాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (NH-16) పై గుంటూరు జిల్లా కాజ సమీపంలో వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాజ టోల్‌ప్లాజా దాటిన తర్వాత విజయవాడ బైపాస్ అవతలి వరకు కొత్తగా ఒక కిలోమీటర్ పొడవున బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం విజయవాడలోని గొల్లపూడి నుంచి కాజ వరకు బైపాస్‌లో భాగంగా ఆరు వరుసల రహదారిని నిర్మించి జాతీయ రహదారితో అనుసంధానించారు. అయితే, గుంటూరు వైపు నుంచి నేరుగా విజయవాడ నగరంలోకి వెళ్లాల్సిన వాహనదారులు ఈ బైపాస్ లూప్ వల్ల తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విజయవాడ వెళ్లడానికి సర్వీస్ రోడ్డు గుండా ఇరుకు మార్గాల్లో ప్రయాణిస్తూ, హయ్‌ల్యాండ్ వద్ద యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. చాలామంది రూట్ తెలియక నేరుగా బైపాస్‌లోకి వెళ్లిపోయి, ఆపై ప్రమాదకరంగా వాహనాలను వెనక్కి తిప్పుతున్నారు. ఈ సమస్యను గమనించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించడంతో ఈ ప్రాజెక్టుకు వేగంగా కదలిక వచ్చింది.
ఈ కొత్త బ్రిడ్జిని మూడు వరుసల (3-Lane) మార్గంతో, సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పనులను వేగవంతం చేసేందుకు వీలుగా ఈ నిర్మాణ బాధ్యతలను పాత కాంట్రాక్టర్ సంస్థకే అప్పగించాలని భావిస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ నుంచి వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిన వెంటనే ఢిల్లీలోని NHAI ఉన్నతాధికారుల అనుమతితో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది (2026) లోనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఎలాంటి గందరగోళం లేకుండా, నేరుగా బ్రిడ్జి మీదుగా ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేయవచ్చు.









