ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రేపు (జూన్ 5) రాష్ట్రవ్యాప్తంగా ‘సైకిల్ యాత్ర’ నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో హెలిప్యాడ్ నుంచి తన విడిది కేంద్రం వరకు సైకిల్‌పై ప్రయాణించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ఈ యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి సవాళ్లను అధిగమించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. సైకిల్ వినియోగం వల్ల కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతూ, రేపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ రోజువారీ కార్యక్రమాలకు సైకిళ్లను ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా మన దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “నా దేశం – నా బాధ్యత” నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పల్లా సూచించారు. ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ద్వారా అటు సంక్షోభాన్ని, ఇటు వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునే ఈసారి మహానాడు కార్యక్రమాన్ని కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా, సుమారు 24 లక్షల మంది కార్యకర్తలు డిజిటల్ వేదికగా హాజరయ్యారని గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తితో ప్రజలంతా ఈ సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.









