అధికారుల నిర్లక్ష్యంతో పల్లెల్లో నీరుగారుతున్న ‘ప్రజాపాలన’.. కాగితాలకే పరిమితమైన గ్రామసభలు!

 సమాచారం లేక వెలవెలబోతున్న గ్రామసభలు: సదాశివపేట మండలంలో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన “ప్రజాపాలన” అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా దారి తప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామసభలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయనే కనీస సమాచారాన్ని అధికారులు ప్రజలకు గానీ, పత్రికలకు గానీ అందించడం లేదు. ఫలితంగా, ఈ సభల్లో ప్రజల భాగస్వామ్యం పూర్తిగా లోపించి, గ్రామసభలు జనం లేక వెలవెలబోతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తూ, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 విధులకు ముఖం చాటేస్తున్న మండల అధికారులు: మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ పథకాల అమలు వివరాలను ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కనీసం కార్యాలయ వేళలను కూడా పాటించకుండా సమయపాలనను గాలికొదిలేశారు. ఉదయం 11 గంటలు దాటినా మండల అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయానికి రాకపోవడం, ఆయన ఎప్పుడు వస్తారో సిబ్బందికే తెలియకపోవడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. అధికారుల ఇష్టారాజ్య వైఖరి, స్థానిక నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే అర్హులైన పేద ప్రజలకు ప్రగతి ఫలాలు అందడం లేదనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారుల తనిఖీలు శూన్యం.. తప్పుడు నివేదికల ముప్పు: క్షేత్రస్థాయిలో ప్రజాపాలన పడకేసినా, పై అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించకుండా, కేవలం క్రింది స్థాయి అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికల ఆధారంగానే ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సైతం తప్పుడు సమాచారం చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సదాశివపేట మండల అధికారుల తీరును మార్చాలని, ప్రజాపాలనను విజయవంతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు