అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టదలచిన ‘వెన్నుపోటు’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసన ప్రదర్శనకు ముందస్తు అనుమతి లేదంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, పెద్దారెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఉద్రిక్తతల నడుమ పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు. ఈ అరెస్ట్‌తో ఆగ్రహించిన వైకాపా శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగడంతో తాడిపత్రిలో అదనపు బలగాలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రిలో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరిగాయి. ఒకే రోజు అటు అధికార కూటమి విజయోత్సవాలు, ఇటు ప్రతిపక్ష వైకాపా పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వైకాపా నిరసనను అడ్డుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గీయుల మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ గరిష్ట స్థాయికి చేరింది.
ఇదిలా ఉండగా, ఏపీలో కూటమి రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఒకవైపు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎన్డీయే నేతల సమక్షంలో భారీ ఎత్తున విజయోత్సవ సభ జరుగుతుండగా.. మరోవైపు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను, డీఎస్సీ పోస్టుల భర్తీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైకాపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. జగన్ చేతిలో పరశురాముడి గొడ్డలి ఉందని, 2029 ఎన్నికల్లో కూటమి అవినీతిని ఆ గొడ్డలితో నరకడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.









