బైక్‌పై వెళ్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్.. వీడియో షేర్ చేస్తూ వీసీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్ నగర రోడ్లపై కొందరు వాహనదారులు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైక్ నడుపుకుంటూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేస్తూ, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ, సదరు రైడర్ బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు. ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి వేగంగా బైక్ నడుపుతూనే, హ్యాండిల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ విపరీత ధోరణిపై స్పందించిన సజ్జనార్.. “ఏ పని చేయడానికైనా ఒక పద్ధతి ఉంటుంది. అంత ఆత్రుత దేనికి? ఇలాంటి మితిమీరిన ఆత్రం చివరకు ప్రాణాల మీదికే తెస్తుంది” అని గట్టిగా హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోయినా, అది కేవలం సదరు వాహనదారుడికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాంతకంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు. నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లపై ఇలాంటి పనులు చేయడం క్షమించరాని నేరమని నెటిజన్లు కూడా సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“కడుపు నింపుకోవడానికి మనం చేసే ఉద్యోగం లేదా పని, మన ప్రాణాలనే కడతేర్చేలా ఉండకూడదు” అని సజ్జనార్ హితవు పలికారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కంపెనీల ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, బైక్ నడిపేటప్పుడు పూర్తి శ్రద్ధ రోడ్డుపైనే పెట్టాలని ఈ సందర్భంగా ఆయన వాహనదారులను హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు