తుని చిన్నారి అదృశ్యం: ఏడు రోజులైనా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ!

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను ఆచూకీ కోసం వారం రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్నారిని వెతికేందుకు.. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్కకు ఏకంగా జీపీఎస్ (GPS) ట్రాకర్ అమర్చి పోలీసులు చేసిన సరికొత్త ప్రయోగం కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైంది. నేటితో చిన్నారి అదృశ్యమై ఏడు రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ లభించకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో ఉన్న ఒక భారీ పామాయిల్ తోటకు గణేష్, భవాని దంపతులు కాపలాదారులుగా ఉంటున్నారు. గత శనివారం రోజున వీరి రెండేళ్ల కుమార్తె జాను.. తమ పెంపుడు కుక్కతో కలిసి ఆడుకుంటూ అకస్మాత్తుగా పక్కనే ఉన్న దట్టమైన అడవి వైపు వెళ్ళిపోయింది. చిన్నారి వయసు చాలా తక్కువ కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వందల మంది సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు రంగంలోకి దిగి వారం రోజులుగా అడవిని జల్లెడ పడుతున్నారు. దట్టమైన పొదలు, క్రూర జంతువుల సంచారం ఉండే ప్రాంతం కావడం వల్ల డ్రోన్ కెమెరాలను సైతం రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క కొన్ని రోజుల క్రితమే ఒంటరిగా ఇంటికి తిరిగి రావడంతో, దానికి చిన్నారి లొకేషన్ తెలిసి ఉంటుందనే ఆలోచనతో పోలీసులు దాని మెడకు ఒక ఆధునిక జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. కానీ, ఆ కుక్క అడవిలోకి వెళ్లకుండా కేవలం తమ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరగడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. పసిగుడ్డు అడవిలోకి వెళ్లి ఏడు రోజులు గడుస్తున్నా కనీసం చిన్నారి ఆనవాళ్లు కూడా దొరక్కపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు తమ శోధన పద్ధతులను మార్చి, ఇతర అనుమానాస్పద కోణాల్లో కూడా దర్యాప్తును ముమ్మరం చేయాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు