చంద్రబాబు సింగపూర్ పర్యటన: టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీపై కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌లతో వేర్వేరుగా కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీ-సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల నుండి సింగపూర్‌కు ఎయిర్ కనెక్టివిటీని (విమాన సర్వీసులు) పెంచడంపై ఈ భేటీలలో ప్రధానంగా చర్చించారు. తయారీ, సేవల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.

సింగపూర్ ప్రధానితో జరిగిన 30 నిమిషాల సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణం, పట్టణాభివృద్ధిలో (అర్బన్ గవర్నెన్స్) సింగపూర్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా తీర్చిదిద్దుతున్నామని తెలిపిన సీఎం.. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో సహకారం అందించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పండుతున్న ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, వీటికి అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్ కల్పించేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టుల అనుకూలతలను ప్రస్తావిస్తూనే.. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ దేశంలోనే కీలక పాత్ర పోషించనుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్, ప్రపంచంతో ఏపీని అనుసంధానించే సబ్-సీ కేబుల్ ప్రాజెక్టులతో పాటు ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్ ఏర్పాటు చేయబోయే భారీ స్టీల్ ప్లాంట్ గురించి కూడా వివరించారు. ఈ చర్చలపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సానుకూలంగా స్పందిస్తూ అమరావతిలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలపై ఆసక్తి కనబరిచారు. ఈ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఏపీ మంత్రి పి. నారాయణ, భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు