దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో చిన్న చిన్న శక్తులుగా కనిపించే వాటిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, అవి ఒకటైనప్పుడు అత్యంత బలమైన ప్రభావాన్ని చూపగలవని సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ వివరించారు.
దేశంలో అవినీతి, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ యువత సోషల్ మీడియాలో ప్రారంభించిన ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమంపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. “సుమతీ శతకంలో చెప్పినట్లు ఎంత బలమైన సర్పం అయినా చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది. ఈ మధ్య కాలంలో యువత నుండి పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ పార్టీని చూడగానే నాకు ఆ పద్యమే గుర్తొచ్చింది” అని వ్యాఖ్యానించారు. కోట్ల మంది యువత ఏకమైతే అది వ్యవస్థపై సానుకూల లేదా ప్రతికూల పరంగా ఎంతో బలమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులు కూడా సమయం కోసం చూస్తున్నాయని, యువత అటువంటి విభజనవాద ఆలోచనల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ఈ జాతీయ సమైక్యత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పవన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో విభజనను సృష్టించే శక్తులలో మనం భాగస్వాములం కాకూడదని హితవు పలికారు. దేశ హితం కోసం, వ్యవస్థలోని లోపాలపై యువత ఐక్యంగా నిలబడి ఎదురొడ్డి పోరాడాలని ఈ సందర్భంగా జనసేనాని పిలుపునిచ్చారు.









