ఇటీవల బీఆర్ఎస్ (BRS) పార్టీతో తెగదెంపులు చేసుకుని, సొంతంగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మనుగడలో ఉందంటే దానికి ముమ్మాటికీ కారణం తానేనని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో పార్టీ నాయకత్వంలో జరిగిన అంతర్గత పరిణామాలను ఆమె ఈ సందర్భంగా బయటపెట్టారు.
తాను జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు తన వద్దకు ఒక విచిత్రమైన ప్రతిపాదనతో వచ్చారని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ (BJP)లో విలీనం చేయాలనే ఆలోచనతో వారు సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. అయితే ఆ ప్రతిపాదన వినగానే తాను తీవ్రంగా వ్యతిరేకించానని, విలీనానికి అస్సలు ఒప్పుకోకుండా ఒంటరిగా స్ట్రాంగ్‌గా నిలబడ్డానని ఆమె పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏదో ఒకరోజు బెయిల్‌పై కచ్చితంగా బయటకు వస్తానని, అంతవరకు పార్టీని వేరే పార్టీకి త్యాగం చేయవద్దని వారికి తేల్చి చెప్పినట్లు వివరించారు.
ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాక కొందరు బీఆర్ఎస్ నేతలు టీవీ స్టూడియోల్లో కూర్చుని తనపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి తానే కారణమంటూ వస్తున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చ అంతా కేవలం అప్పటి ప్రభుత్వ వైఫల్యాల గురించే జరిగిందని, కానీ ఆ చేదు నిజాన్ని అంగీకరించడానికి బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం జైల్లో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన తనకు, సొంత పార్టీలోనే తీవ్రమైన పక్షపాతం, అవమానాలు ఎదురయ్యాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.









