కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా: ‘జగన్ 2.0’తో సరికొత్త వ్యూహం.. మరో ఒకటిన్నర సంవత్సరంలో మళ్లీ పాదయాత్ర!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ‘జగన్ 2.0’ రూపంలో పార్టీ కార్యకర్తలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని, వారిని అందరికంటే మిన్నగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నేరుగా కార్యకర్తల చేతుల మీదుగానే ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తద్వారా క్షేత్రస్థాయిలో వారికి తగిన గుర్తింపు, ప్రజాదరణ దక్కేలా చేస్తామని స్పష్టం చేస్తూ, కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాననే నమ్మకాన్ని క్యాడర్‌లో నింపారు.

ఇదే సమావేశంలో తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తూ, మరో ఒకటిన్నర సంవత్సరంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ‘పాదయాత్ర’ను ప్రారంభిస్తానని వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి పాలనను దుర్మార్గమైనదిగా అభివర్ణించిన ఆయన, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి త్వరలోనే ముగింపు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రజా రంజక పాలనను తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తాను కేవలం తాత్కాలిక అధికారం కోసమే కాకుండా, ప్రజా సంక్షేమం ద్వారా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవడమే తన ఆశయమని జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. తాను భౌతికంగా దూరమైనా, తాను చేసిన మంచి పనుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో తన ఫొటో శాశ్వతంగా ఉండిపోవాలనేదే తన జీవిత తపన, తాపత్రయమని వివరించారు. ఈ వ్యూహాత్మక ప్రకటనలతో క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను మానసికంగా బలోపేతం చేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు