“మా అత్త త్వరగా చనిపోవాలి స్వామీ”.. ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు!

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కిస్తున్న సమయంలో వారికి కొన్ని రూ.20 కరెన్సీ నోట్లు కనిపించాయి. వాటిపై రాసి ఉన్న రాతలను చూసి అధికారులు, భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఒక నోటుపై “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. తొందరగా మా అత్త చనిపోయేలా చూడు” అని, మరో నోటుపై “స్వామీ.. మా అత్త త్వరగా చనిపోవాలి” అని ఒక మహిళ రాసి హుండీలో వేసినట్లు గుర్తించారు.

సాధారణంగా భక్తులు దేవుడిని దర్శించుకుని తమకు మంచి జరగాలని, ఉద్యోగం, ఆరోగ్యం సిద్ధించాలని కోరుకుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా ఓ కోడలు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ దేవుడికి మొరపెట్టుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబంలో అత్త పెట్టే హింసలు, వేధింపులు భరించలేక, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆ మహిళ.. చివరకు దేవుడి హుండీనే తన ఆవేదనను పంచుకునే వేదికగా మార్చుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి వింత సంఘటనలు ఆలయాల్లో వెలుగుచూడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, వ్యవస్థలపై ఫిర్యాదులను దేవుడికి లేఖల రూపంలో హుండీలలో వేయడం పెరుగుతోంది. గతంలో జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో వసతులు బాగోలేవని ఒక భక్తుడు లేఖ వేయగా, అనంతపురం జిల్లాలోనే ఒక ఆలయంలో దొంగతనం చేసిన వ్యక్తులు నెల రోజుల తర్వాత క్షమాపణ లేఖతో పాటు ఆ సొమ్మును తిరిగి హుండీలో వేసి వెళ్లిన ఘటనలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు