సత్యవేడు సబ్ జైలు అధికారికంగా మూసివేత: ఖైదీలు చిత్తూరుకు తరలింపు!

తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన సబ్ జైలు భద్రతా లోపాల కారణంగా మంగళవారం నుండి అధికారికంగా మూతపడింది. జైలు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, పైకప్పు దెబ్బతినడం, చుట్టూ ఉన్న ప్రహరీగోడలు పటిష్టంగా లేకపోవడం వంటి ప్రధాన లోపాలను జైలు శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఖైదీల భద్రతను దృష్ట్యా జైలును మూసివేయాలని నిర్ణయించి, అందులోని ఏడుగురు రిమాండ్ ఖైదీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య చిత్తూరు జిల్లా కేంద్ర జైలుకు తరలించారు.

ఈ జైలు మూసివేతతో స్థానిక పోలీసులకు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ఇకపై సత్యవేడుతో పాటు నాగలాపురం, వరదయ్యపాళెం, పిచ్చాటూరు మండలాల్లో నమోదయ్యే కేసుల నిందితులను రిమాండ్ కోసం చిత్తూరుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకే ఒక్క ఖైదీని చిత్తూరుకు తరలించాలన్నా కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది బందోబస్తుగా వెళ్లాల్సి రావడంతో, ఇప్పటికే తీవ్ర సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న సత్యవేడు సర్కిల్ పోలీసులపై ఇది మరింత అదనపు పనిభారంగా మారనుంది.

గత రెండేళ్లుగా సత్యవేడు సబ్ జైలు మూసివేతపై ప్రచారం జరుగుతున్నప్పటికీ, జైలు భవనాన్ని బలోపేతం చేసి ఇక్కడే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఒకదాని తర్వాత ఒకటిగా కీలక ప్రభుత్వ సంస్థలు తరలిపోతుండటంతో సత్యవేడు నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు