సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల సాధన కోసం ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-5 గనిని సందర్శించి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దాదాపు 1200 మంది కార్మికుల వారసులకు తక్షణమే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే జులై 20 నుంచి తాను సింగరేణి కార్మికుల కోసం నిరాహార దీక్షకు కూర్చుంటానని సంచలన ప్రకటన చేశారు. సింగరేణిలో ఏ చిన్న పని జరగాలన్నా నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే లంచాలు అడుగుతున్నారంటూ ఆమె తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
రిటైర్ అయిన బొగ్గుగని కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా ‘హౌసింగ్ బోర్డు’ ఏర్పాటు చేయాలని, కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కవిత డిమాండ్ చేశారు. గనుల లోపల పనిచేసే కార్మికులకు కనీసం స్వచ్ఛమైన గాలి, తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వడం లేదని మండిపడిన ఆమె, తెలంగాణ హక్కుల రక్షణ కోసం తాను కొత్తగా స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీని బొగ్గుగని కార్మికులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.









