ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హావభావాలు, మాట్లాడే తీరుపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో కంటే నిజ జీవితంలోనే అద్భుతంగా నటిస్తున్నారని, ఆయన గనుక డిప్యూటీ సీఎం కాకపోయి ఉంటే ఆయన మాటలకు తన పీఏ కూడా స్పందించేవాడు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత రాజకీయాలను ప్రస్తావిస్తూ.. 2019 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని శ్రవణ్ కుమార్ నిలదీశారు. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ‘సుగాలి ప్రీతి’ కేసును పవన్ కల్యాణ్ డీల్ చేస్తున్న తీరుపై ఆయన పలు లీగల్ పాయింట్లను లేవనెత్తారు. సుగాలి ప్రీతి అసలు ఏ సంవత్సరంలో చనిపోయిందో కూడా కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసు విషయంలో గట్టిగా అరిచిన పవన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని ఆరోపించారు.
సుగాలి ప్రీతి కేసులో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో అన్ని రకాల పక్కా ఆధారాలు ఉన్నాయని, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టులో అత్యంత భద్రంగా ఉన్నాయని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆధారాలు లేవంటూ పవన్ కల్యాణ్ మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేవనే సాకుతో నిందితులను ఈ కేసు నుంచి తప్పించాలని పవన్ చూస్తున్నారా అని నిలదీస్తూ, పవన్ కల్యాణ్ అజ్ఞానాన్ని చూసి జనసేన నేతలు, కార్యకర్తలు తరించాలంటూ శ్రవణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.









