నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) తన రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను తన తండ్రి కేసీఆర్ అంత మంచివాడిని కాదని, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, రాబోయే రోజుల్లో అనుసరించబోయే రాజకీయ వ్యూహంపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారిని, తమ పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోబోమని అన్నారు. అలాగే కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన కార్యకర్తలను సైతం గుర్తుపెట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుత పాలకులను ఉద్దేశిస్తూ.. వచ్చే ఐదేళ్లు “చిట్టి నాయుడు”కి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత తనదేనని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారు భవిష్యత్తులో ఉద్యోగ విరమణ చేసినా, పారిపోయినా, లేదా సప్తసముద్రాల అవతలకు వెళ్లి దాక్కున్నా వెతికి పట్టుకొస్తానని కేటీఆర్ శపథం చేశారు. తమ వారిని సతాయించిన ప్రతి ఒక్కరినీ వెతికి తెచ్చి కార్యకర్తల ముందట నిలబెట్టే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ హెచ్చరికలను తానేదో ఊరికే అనడం లేదని, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు